కీర్తనలు 50
  • 1 దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.
  • 2 పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు
  • 3 మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
  • 4 ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై
  • 5 బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.
  • 6 దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.)
  • 7 నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆల కించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవు డను నేను నీ మీద సాక్ష్యము పలికెదను
  • 8 నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.
  • 9 నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.
  • 10 అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా
  • 11 కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
  • 12 లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
  • 13 వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?
  • 14 దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.
  • 15 ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
  • 16 భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?
  • 17 దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
  • 18 నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
  • 19 కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.
  • 20 నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.
  • 21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను
  • 22 దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును
  • 23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.