కీర్తనలు 46
  • 1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
  • 2 కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
  • 3 వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)
  • 4 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.
  • 5 దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు.
  • 6 జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది.
  • 7 సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
  • 8 యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
  • 9 ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
  • 10 ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
  • 11 సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.