కీర్తనలు 33
  • 1 నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము... చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
  • 2 సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
  • 3 ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.
  • 4 యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది.
  • 5 ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది.
  • 6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
  • 7 సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
  • 8 లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను.
  • 9 ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.
  • 10 అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.
  • 11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.
  • 12 యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.
  • 13 యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.
  • 14 తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.
  • 15 ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు.
  • 16 ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.
  • 17 రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు.
  • 18 వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
  • 19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది.
  • 20 మనము యెహోవా పరిశుద్ధనామమందు నమి్మకయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది
  • 21 మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.
  • 22 యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక.