హబక్కూకు 1
  • 1 ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
  • 2 యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.
  • 3 నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.
  • 4 అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.
  • 5 అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దిన ములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.
  • 6 ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను.
  • 7 వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.
  • 8 వారి గుఱ్ఱ ములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడు దురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.
  • 9 ​వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.
  • 10 రాజు లను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.
  • 11 తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.
  • 12 ​యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.
  • 13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?
  • 14 ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.
  • 15 వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.
  • 16 కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.
  • 17 వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయు చుండవలెనా?