కీర్తనలు 37
  • 1 చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
  • 2 వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు
  • 3 యెహోవాయందు నమి్మకయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
  • 4 యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
  • 5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.
  • 6 ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.
  • 7 యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
  • 8 కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము
  • 9 కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.
  • 10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
  • 11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు
  • 12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.
  • 13 వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
  • 14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి యున్నారు
  • 15 వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.
  • 16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
  • 17 భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
  • 18 నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
  • 19 ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.
  • 20 భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
  • 21 భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
  • 22 యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.
  • 23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
  • 24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
  • 25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
  • 26 దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.
  • 27 కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు
  • 28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
  • 29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.
  • 30 నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.
  • 31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.
  • 32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
  • 33 వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు.
  • 34 యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
  • 35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.
  • 36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
  • 37 నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు
  • 38 భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము
  • 39 బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక
  • 40 ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.