విలాపవాక్యములు 5
  • 1 యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
  • 2 మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను.
  • 3 మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి.
  • 4 ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితివిు క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.
  • 5 మమ్మును తురుమువారు మా మెడలమీదికి ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు.
  • 6 పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.
  • 7 మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
  • 8 దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.
  • 9 ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
  • 10 మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
  • 11 శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.
  • 12 చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.
  • 13 ¸°వనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.
  • 14 పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸°వనులు సంగీతము మానిరి.
  • 15 సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
  • 16 మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
  • 17 దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది
  • 18 నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.
  • 19 యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.
  • 20 నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
  • 21 యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.
  • 22 నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.