సామెతలు 26
  • 1 ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
  • 2 రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.
  • 3 గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.
  • 4 వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
  • 5 వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.
  • 6 మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమా నుడు.
  • 7 కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును
  • 8 బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు.
  • 9 మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్న ట్లుండును.
  • 10 అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును.
  • 11 తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.
  • 12 తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.
  • 13 సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును.
  • 14 ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.
  • 15 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.
  • 16 హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
  • 17 తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.
  • 18 తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు
  • 19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
  • 20 కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
  • 21 వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.
  • 22 కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.
  • 23 చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.
  • 24 పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
  • 25 వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మ కుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
  • 26 వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
  • 27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.
  • 28 అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషిం చును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.