సామెతలు 13
  • 1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
  • 2 నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.
  • 3 తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.
  • 4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
  • 5 నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.
  • 6 యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
  • 7 ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.
  • 8 ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.
  • 9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.
  • 10 గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
  • 11 మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.
  • 12 కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
  • 13 ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.
  • 14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.
  • 15 సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.
  • 16 వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.
  • 17 దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.
  • 18 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.
  • 19 ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.
  • 20 జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
  • 21 కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
  • 22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
  • 23 బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.
  • 24 బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
  • 25 నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.