యోబు 38
  • 1 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను
  • 2 జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
  • 3 పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
  • 4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
  • 5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
  • 6 దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
  • 7 ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
  • 8 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
  • 9 నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?
  • 10 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
  • 11 నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
  • 12 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
  • 13 అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
  • 14 ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును.
  • 15 దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
  • 16 సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
  • 17 మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
  • 18 భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
  • 19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
  • 20 దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
  • 21 నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
  • 22 నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
  • 23 ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
  • 24 వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
  • 25 నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
  • 26 పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
  • 27 ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
  • 28 వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
  • 29 మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
  • 30 జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
  • 31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
  • 32 వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
  • 33 ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
  • 34 జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
  • 35 మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
  • 36 అంతరింద్రియములలో2 జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు3 తెలివి నిచ్చినవాడెవడు?
  • 37 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
  • 38 ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?
  • 39 ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
  • 40 సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
  • 41 తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?