యోబు 35
  • 1 మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
  • 2 నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే?
  • 3 ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా?
  • 4 నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
  • 5 ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.
  • 6 నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?
  • 7 నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
  • 8 నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును.
  • 9 అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.
  • 10 అయితేరాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు
  • 11 భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు.
  • 12 కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు.
  • 13 నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
  • 14 ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.
  • 15 ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను
  • 16 నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.