జెకర్యా 14
  • 1 ఇదిగో యెహోవా దినమువచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింప బడును.
  • 2 ​ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవు చున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెర పట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.
  • 3 అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
  • 4 ఆ దిన మున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.
  • 5 కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపము నకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవు దురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
  • 6 ​యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.
  • 7 ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలు గును.
  • 8 ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాల మందును ఆలాగుననే జరుగును.
  • 9 ​యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.
  • 10 ​యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును,హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపిం చును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,
  • 11 పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.
  • 12 మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచి యున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలు కలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.
  • 13 ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.
  • 14 యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టు నున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.
  • 15 ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచర గాడిదల మీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండు పాళె ములో ఉన్న పశువులన్నిటిమీదను తెగుళ్లుపడును.
  • 16 మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషిం చినవారందరును సైన్య ములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.
  • 17 లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరిమీద వర్షము కురువకుండును.
  • 18 ​ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును.
  • 19 ఐగుప్తీయులకును, పర్ణ శాలపండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికిని రాగల శిక్ష యిదే.
  • 20 ఆ దినమున గుఱ్ఱములయొక్క కళ్లె ములమీదయెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయ బడును; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలి పీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచ బడును.
  • 21 యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నియు సైన్యములకు అధిపతియగు యెహో వాకు ప్రతిష్టితములగును; బలిపశువులను వధించువారంద రును వాటిలో కావలసినవాటిని తీసికొని వాటిలో వండు కొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.