యాకోబు 3
  • 1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.
  • 2 అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగ
  • 3 గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా
  • 4 ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.
  • 5 ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!
  • 6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
  • 7 మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని
  • 8 యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
  • 9 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
  • 10 ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.
  • 11 నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?
  • 12 నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.
  • 13 మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.
  • 14 అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్య మునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
  • 15 ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.
  • 16 ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
  • 17 అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనిన
  • 18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.