యెషయా 32
  • 1 ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.
  • 2 మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
  • 3 చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.
  • 4 చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
  • 5 మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.
  • 6 మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.
  • 7 మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
  • 8 ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
  • 9 సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
  • 10 నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
  • 11 సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.
  • 12 రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.
  • 13 నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు
  • 14 నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ లుగా ఉండును
  • 15 అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.
  • 16 అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును
  • 17 నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
  • 18 అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును
  • 19 పట్టణము నిశ్చయముగా కూలిపోవును.
  • 20 సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.