నిర్గమకాండము 26
  • 1 మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.
  • 2 ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.
  • 3 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.
  • 4 తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.
  • 5 ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయ వలెను.
  • 6 మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.
  • 7 మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.
  • 8 ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.
  • 9 అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.
  • 10 తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.
  • 11 మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను.
  • 12 ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.
  • 13 మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.
  • 14 మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.
  • 15 మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
  • 16 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.
  • 17 ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.
  • 18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.
  • 19 మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.
  • 20 మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,
  • 21 ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలు వది వెండి దిమ్మలు ఉండవలెను.
  • 22 పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.
  • 23 మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.
  • 24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.
  • 25 పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను.
  • 26 తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును
  • 27 మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;
  • 28 ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.
  • 29 ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
  • 30 అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
  • 31 మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.
  • 32 తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.
  • 33 ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
  • 34 అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.
  • 35 అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచ వలెను.
  • 36 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
  • 37 ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింప వలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.